బిందమ్మ... మా డాడీ పిలుపు మళ్లీ రాదా!

చిన్నప్పుడు నాకు "డాడీ" అంటే ఒక భయం. ఒక కఠినమైన శాసనం. ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన నన్ను ఎప్పుడూ నవ్వి పలకరించింది లేదు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవారు. నేను కనిపిస్తే చాలు, "వెళ్లి బుక్స్ తీసి చదువుకో" అనేవారు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, కోపాలు, కొట్టడాలు... నా స్నేహితులంతా వాళ్ల నాన్నలతో ఎంతో సరదాగా, ఫ్రీగా తిరుగుతుంటే, నేను మాత్రం మా డాడీ వస్తున్నారంటేనే గదిలోకి వెళ్లి దాక్కునేదాన్ని. తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియకుండానే నేను పెరిగాను. ఆ భయం నా మనసులో ఎంత బలంగా నాటుకుపోయిందంటే, 'ఈ ఇల్లు దాటి ఎలాగైనా బయటపడిపోవాలి, దానికి పెళ్లే ఒకటే మార్గం' అనుకున్నాను. అందుకే, చదువుకునే వయసులో... కేవలం 17 ఏళ్లకే మా డాడీ తెచ్చిన మొదటి సంబంధాన్ని ఎదిరించకుండా పెళ్లి చేసేసుకున్నాను.


అప్పగింతల సమయం వచ్చింది. మా అమ్మ నన్ను వదిలి ఉండలేక గుండెలు పగిలేలా ఏడుస్తోంది. కానీ చిత్రంగా నా కళ్లల్లో ఒక్క కన్నీటి చుక్క లేదు. 'అమ్మో! ఈ నరకం నుంచి బయటపడిపోతున్నాను' అనే భావనే నాలో ఉంది. అందరికీ వీడ్కోలు చెప్పి బయటకు వచ్చాను. బయట అరుగు మీద మా డాడీ కూర్చుని ఉన్నారు. వెళ్తూ వెళ్తూ, ఎందుకో నా నోటి వెంట, "డాడీ, నేను వెళ్లి వస్తాను" అనే మాట వచ్చింది. అప్పటివరకు శిలలా కూర్చున్న మా డాడీ ఒక్కసారిగా తల పైకెత్తి, కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా... "బిందమ్మ... వెళ్ళిపోతున్నావా రా?" అన్నారు. ఆ గొంతులో వణకు, ఆ కళ్లల్లోని బాధ నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ కొట్టే మా డాడీయేనా ఈయన? నాకోసం ఏడుస్తున్నారా? అంతే... అప్పటివరకు రాయిలా ఉన్న నా మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. మా డాడీ దగ్గరే కూలబడిపోయి చిన్నపిల్లలా ఏడ్చేశాను. డాడీ లోనే ప్రేమని నేను మొదటిసారి స్పర్శించిన క్షణమది.


పెళ్లయ్యాక మా అత్తిల్లు పుట్టింటికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరుసటి రోజు నుంచే నాన్న రోజు ఉదయం 6 గంటలకల్లా బండి వేసుకుని మా ఇంటికి వచ్చేసేవారు. కేవలం నన్ను చూడటానికి, నా ముఖం చూసి తృప్తి పడటానికి. కొన్ని రోజులకు నేను గర్భవతినయ్యాను. నాకు బాబు పుట్టాడు. ఆ చిన్నారి మనవడితో ఆడుకోవడానికి డాడీ రోజు రావడం మొదలుపెట్టారు. నాన్న ప్రేమ ఏంటో నాకు అప్పుడు మెల్లమెల్లగా అర్థం కాసాగింది. ఆయనకు ప్రేమను చూపించడం తెలియదు, కానీ గుండెల్లో నాపై అనంతమైన ప్రేమ ఉంది. అయినా సరే... చిన్నప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి, పెళ్లయ్యాక కూడా నేను ఆయనతో అంత ఓపెన్‌గా మాట్లాడేదాన్ని కాదు. ఆ పాత భయం, ఒక చిన్న అడ్డుగోడలా మా మధ్య ఉండిపోయింది. ఆ భయమే మా మధ్య దూరాన్ని పెంచింది. ఒక చిన్న గొడవ కారణంగా, నేను మా డాడీ తో ఏకంగా నాలుగు సంవత్సరాలు మాట్లాడటం మానేశాను. ఆ నాలుగు ఏళ్లు ఆయన నన్ను చూడటానికి ఎంత తల్లడిల్లిపోయారో, నా పిలుపు కోసం ఎంత ఎదురుచూశారో అప్పట్లో నాకు తెలియలేదు.

నాలుగేళ్ల తర్వాత, ఒకరోజు నా భర్త నా బాధను చూడలేక, నా ప్రమేయం లేకుండానే మా డాడీకి డైరెక్ట్ గా ఫోన్ చేసి నా చేతికి ఇచ్చారు. నేను ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని భయంగా, "హలో..." అన్నాను.


అవతల నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం... ఆ తర్వాత ఏడుస్తూ, శృతి తప్పిన గొంతుతో... "బిందమ్మ..." అన్న పిలుపు వినిపించింది. ఆ ఒక్క పిలుపులో నాలుగేళ్ల విరహం, బాధ, ప్రేమ అన్నీ ఒకేసారి నా గుండెను తాకాయి. ఫోన్ పట్టుకుని నేను కూడా ఏడ్చేశాను.

ఆ తర్వాత డాడీ మళ్లీ మా ఇంటికి రావడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన నాతో చాలా విషయాలు మాట్లాడేవారు. చిన్నప్పుడు దక్కని మా డాడీ మాటల తాలూకు ప్రేమ, ఇప్పుడు ఆయన మాటల్లో నాకు స్పష్టంగా కనిపించేది. సాయంత్రం ఆయన మా ఇంటికి వచ్చేవారు. నేను వంటింట్లో ఏదైనా పనిలో ఉంటే, నన్ను అస్సలు డిస్టర్బ్ చేసేవారు కాదు. అంత పెద్ద మనిషి... డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి, ఆయనే స్వయంగా ఒక ప్లేట్ తీసుకుని, అన్నం పెట్టుకునేవారు. నేను చేసిన చింతపండు చారు అంటే మా డాడీకి ప్రాణం. గిన్నెలో ఉన్న ఆ చారును అన్నంలో వేసుకుని, ఎంతో తృప్తిగా తిని, నన్ను చూసి ప్రశాంతంగా వెళ్ళిపోయేవారు. 'నా కూతురు ఇల్లు, నాకేం తక్కువ' అన్నంత స్వతంత్రంగా ఉండేవారు.


కానీ... ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మేము మాట్లాడుకోవడం ప్రారంభించిన కేవలం ఐదు, ఆరు నెలలకే... ఒకరోజు మా డాడీకి సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన కన్నుమూశారు. వార్త వినగానే నా ప్రపంచం ఆగిపోయింది. అసలు డాడీ చనిపోతే నేను ఇంతలా ఏడుస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. శవంలా పడి ఉన్న మా డాడీ ని పట్టుకుని ఊరంతా వినేలా ఏడ్చాను. "డాడీ... 'బిందమ్మ' అని ఒక్కసారి పిలవవా డాడీ... నీకు ఇష్టమైన చింతపండు చారు చేసి పెట్టాను డాడీ, వచ్చి తినవా... నన్ను డిస్టర్బ్ చేయనని చెప్పి మాట్లాడకుండానే వెళ్ళిపోయావా డాడీ..." అంటూ నా గుండె బద్దలయ్యేలా ఏడ్చాను. కానీ మా డాడీ తిరిగి రాలేదు. 2017 లో డాడీ చనిపోయారు. ఈరోజు 2026... తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ ప్రతిరోజూ మా డాడీ గుర్తుకొస్తే నా కళ్లల్లో నీళ్లు ఆగవు.

ఇంట్లో చింతపండు చారు కాస్తున్నప్పుడల్లా డైనింగ్ టేబుల్ వైపు చూస్తాను... అక్కడ ప్లేట్ పట్టుకుని కూర్చునే డాడీ కనిపించరు. ఉదయం 6 గంటలు కాగానే గుమ్మం వైపు చూస్తాను... బండి దిగి వచ్చే నా తండ్రి రూపం కనిపించదు.


నా మనసును ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న తొలిచేస్తోంది... "బతికున్నప్పుడు ఆయన్ని నాలుగేళ్లు దూరం పెట్టాను. ఆయన ప్రేమను పూర్తిగా అనుభవించే లోపే కాలం ఆయన్ని లాగేసుకుంది. ఇప్పుడు ఆయన లేరని నేను ఎంత ఏడ్చినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా ఏం లాభం? ఆ నాలుగు సంవత్సరాలు నేను మాట్లాడనప్పుడు ఆయన గుండె ఎంత రగిలిపోయిందో కదా! ఆ బాధను నేను ఎలా తీర్చగలను?" ఇప్పుడు నా దగ్గర మిగిలింది డాడీ జ్ఞాపకాలు, ఆ నిశ్శబ్దపు చారు గిన్నె, కళ్లల్లో ఎప్పటికీ ఇంకిపోని కన్నీళ్లు మాత్రమే.


ముగింపు: తల్లి ప్రేమ మనకు ప్రతిక్షణం కనిపిస్తూనే ఉంటుంది. కానీ నాన్న ప్రేమ ఒక కొబ్బరికాయ లాంటిది. పైన ఎంత కఠినంగా ఉన్నా, లోపల తీపి నీరు ఉంటుంది. ఆ ప్రేమని బతికున్నప్పుడే గుర్తించి హత్తుకోండి... ఎందుకంటే, వాళ్లు వెళ్ళిపోయాక ఏడ్చే ఏడుపు వాళ్లకి వినపడదు, మనం కార్చే కన్నీళ్లు వాళ్లని తిరిగి తీసుకురాలేవు.


"డాడీ... నువ్వు ఎక్కడున్నా, నీ 'బిందమ్మ' నిన్ను చాలా మిస్ అవుతోంది నాన్నా!"


✍🏻 జెట్టి హిమబిందు ✍🏻 D/o పిల్లలమర్రి పరమేశ్వరరావు

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE