అనంతపురం జిల్లాలో నామినేషన్ కేంద్రాలపై హైటెక్ నిఘా!

డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను పరిశీలించిన ఎస్పీ పి. జగదీష్

అనంతపురం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నామినేషన్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు.

డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలతో పాటు తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం మున్సిపల్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రత్యక్ష దృశ్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు.

సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన తాడిపత్రితో పాటు ఇతర నామినేషన్ కేంద్రాల వద్ద పరిస్థితులను ఎస్పీ డిజిటల్ స్క్రీన్ల ద్వారా స్వయంగా పరిశీలించారు.

క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు

ఎన్నికల నియమ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా వైర్‌లెస్ ద్వారా క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద జనసమూహాలను నియంత్రించడం, వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పటిష్టమైన పోలీసు భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం వెల్లడించింది.

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE